Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- బీజేఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి
- బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి చర్చను పక్కదారి పట్టించారని ఆరోపణ
- మేనిఫెస్టోలో లేని అంశాలను తెరపైకి తెస్తున్నారంటూ ఆగ్రహం
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డూప్ ఫైట్ చేస్తున్నాయని, బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి చర్చను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, మేనిఫెస్టోలో లేని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి అంశాలను ఎందుకు తెరపైకి తెస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశారో రికార్డులు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ, వాటిని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన నిలదీశారు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ వంటి అంశాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి హామీలను విస్మరించి, ప్రశ్నలకు దాటవేస్తూ ఏకపాత్రాభినయం చేస్తున్నారని అన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానాలు చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని, ఆయన ప్రసంగం నిస్సారంగా ఉందని తెలిపారు.
శాసనసభలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అయితే వాటి ఊసే లేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉందని ఆయన విమర్శించారు. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం సరికాదని, రుణామాఫీ పూర్తయిందని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.