L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్

- మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఎల్2ఈ: ఎంపురాన్
- పవర్ ఫుల్ రోల్ లో మలయాళ సూపర్ స్టార్
- భారత్ లో తొలి ఆట 6 గంటలకు ప్రారంభం
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో వస్తున్న భారీ చిత్రం L2E: ఎంపురాన్ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రానికి సీక్వెల్.
తాజాగా L2E: ఎంపురాన్ చిత్రం విడుదలకు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా తొలి ఆట భారత కాలమానం ప్రకారం మార్చి 27 ఉదయం 6:00 గంటలకు ప్రారంభమవుతుంది. మిగిలిన చోట్ల ఆయా దేశాల కాలమానం ప్రకారం ప్రదర్శనలు ప్రారంభమవుతాయని వివరించారు.
మురళి గోపి ఈ చిత్రానికి కథను అందించారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ మరియు శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోని పెరుంబావూర్, గోకులం గోపాలన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మోహన్ లాల్ నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్, ఇంద్రజిత్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేడేకర్, నైలా ఉషా, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, మణికుట్టన్, అనీష్ జి. మీనన్, శివద, అలెక్స్ ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లైన్ ఈ చిత్రం ద్వారా భారతీయ తెరకు పరిచయం కానున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ 2023 అక్టోబర్ 5న ఫరీదాబాద్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళలో కూడా చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాను 1:2.8 యాస్పెక్ట్ రేషియోలో చిత్రీకరించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న కొచ్చిలో టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి సినిమా ప్రమోషన్ ప్రారంభించారు. ఫిబ్రవరి 9 నుంచి ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌లను విడుదల చేశారు. దీంతో పాటు, ఒక్కో పాత్ర గురించి 2-3 నిమిషాల వీడియోలను విడుదల చేశారు. ఫిబ్రవరి 26న మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ ప్రమోషన్ ముగిసింది.
L2E: ఎంపురాన్ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.