Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy criticises KCR

  • స్టేషన్ ఘనపూర్ లో ప్రజాపాలన సభ
  • హాజరైన రేవంత్ రెడ్డి
  • తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం పురిటిగడ్డ అని వెల్లడి

తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ వంటి వీరనారీమణులు పాలించిన నేల ఇది అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంతం పురిటిగడ్డ అని ఆయన అభివర్ణించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మామునూరు ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడుది నిలుపుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ఆయన విమర్శించారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని మండిపడ్డారు. ఉచిత కరెంటు పేరుతో డిస్కంలకు భారీగా బకాయిలు పెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్లను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైన ఉద్యోగ నియామకాలు వేగంగా జరుగుతున్నాయని, ఒక్క సంవత్సరంలోనే 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం గత ప్రభుత్వం చేసిన అప్పులకు సరిపోవడం లేదని, అయినప్పటికీ సంక్షేమ పథకాలకు నిధులు ఆపడం లేదని ఆయన స్పష్టం చేశారు. కడియం శ్రీహరి నిజమైన నాయకుడని, ఆయన తన కోసం ఎలాంటి పైరవీలు చేయకుండా ప్రజల కోసమే పథకాలు అడుగుతారని రేవంత్ రెడ్డి కొనియాడారు.

కడియం కావ్యను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో కొట్లాడి వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఖాజీపేటకు రైల్వే డివిజన్‌ను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును లక్షల కోట్లు పెట్టి నిర్మించినా అది మూడేళ్లు కూడా నిలబడలేదని, అది కాళేశ్వరం కాదని కూలేశ్వరం అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులు ఎన్ని, బీఆర్ఎస్ నిర్మించినవి ఎన్నో చర్చకు సిద్ధమా? అని కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News