DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ

- ఇంట్లోని సీసీకెమెరాల కనెక్షన్ కట్ చేశాడన్న డీకే అరుణ
- గంటన్నర పాటు తమ ఇంట్లో ఉన్నాడని వెల్లడి
- వస్తువులేమీ తీసుకెళ్లలేదని వివరణ
- తమకు భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని విజ్ఞప్తి
గత రాత్రి తమ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడని బీజేపీ ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. కిచెన్, డైనింగ్ హాల్ లో ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేశాడని తెలిపారు. ఆ గుర్తుతెలియని వ్యక్తి దాదాపు గంటన్నర పాటు తమ ఇంట్లో ఉన్నాడని వివరించారు. తాను ఇప్పటికే చాలాసార్లు భద్రత కోసం అడిగానని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని డీకే అరుణ ఆరోపించారు. తమ కుటుంబానికి భద్రత చాలా అవసరం అని స్పష్టం చేశారు.
నిన్న రాత్రి తమ ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి... చోరీ కోసం వచ్చి ఉంటే ఏదైనా పట్టుకెళ్లి ఉండాలి... కానీ అలా జరగలేదు అని డీకే అరుణ వెల్లడించారు. ఇప్పటికైనా తమ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తన తండ్రిపై దాడి జరిగిన సంగతి తెలిసిందేనని, తాజా ఘటనతో తమ కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.