Old Man Missing: 20 ఏళ్ల కిందట తప్పిపోయి... ఇన్నాళ్లకు కుటుంబ సభ్యులను కలుసుకున్న వృద్ధుడు

- తమిళనాడులో రైలు స్టేషన్ లో తప్పిపోయిన అప్పారావు
- ఓ రైతు వద్ద వెట్టిచాకిరీ
- అధికారుల చొరవతో అయినవాళ్లను కలుసుకున్న వైనం
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అప్పారావు అనే వృద్ధుడు 20 ఏళ్ల కిందట తప్పిపోయి, అధికారుల చొరవతో ఇన్నాళ్లకు మళ్లీ తన కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆ వృద్ధుడ్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అప్పారావు 20 ఏళ్ల కిందట తమిళనాడులో రైల్వే స్టేషన్ లో తప్పిపోయాడు. రైలు దిగిన అప్పారావు, రైలు వెళ్లిపోవడంతో అక్కడే చిక్కుకుపోయాడు. నిరక్షరాస్యుడైన అప్పారావు, ఎటు వెళ్లాలో తెలియక, తమిళనాడులోనే ఓ రైతు వద్ద గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. తన కుటుంబ సభ్యులను కలుసుకోవడం అతడి శక్తికి మించిన పనైంది. దాంతో ఆ ఆశలు వదిలేసి, ఆ రైతు వద్ద వెట్టిచాకిరీలో కొనసాగాడు.
కాగా, జనవరిలో తమిళనాడులో అధికారులు కూలీల వివరాలు సేకరిస్తుండగా, అప్పారావు వ్యవహారం బయటపడింది. వారు అప్పారావు తప్పిపోయిన విషయాన్ని ఏపీ అధికారులకు తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్... అప్పారావు విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అప్పారావును తమిళనాడు నుంచి తీసుకువచ్చి కుమార్తె సాయమ్మకు అప్పగించారు.
అటు, అప్పారావుతో వెట్టిచాకిరీ చేయించుకున్న రైతు నుంచి తమిళనాడు ప్రభుత్వం రూ.2 లక్షలు వసూలు చేసింది. ఆ మొత్తానికి మరో రూ.30 వేలు కలిపి మొత్తం రూ.2.30 లక్షల చెక్ ను అప్పారావుకు అందజేసింది.
రెండు దశాబ్దాల తర్వాత తండ్రిని కలవడం ఆనందంగా ఉందని అప్పారావు కుమార్తె సాయమ్మ వెల్లడించింది.