Sunita Williams: ఈ 9 నెలల కాలానికి సునీతా విలియమ్స్ కు నాసా ఎంత చెల్లిస్తుందో తెలుసా...!

- గత 9 నెలలుగా అంతరిక్షంలోనే సునీతా, విల్మోర్
- సాధారణ జీతమే... ఓవర్‌టైమ్ చెల్లింపు ఉండదన్న క్యాడీ కోల్ మన్
- రూ.1.06 కోట్లు అందుకోనున్న సునీతా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ మార్చి 19న తిరిగి భూమికి రానున్నారు. వీరి మిషన్ తొలుత ఎనిమిది రోజుల ప్రణాళికతో ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యలతో వారిద్దరూ ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయి 9 నెలలు బలవంతంగా గడపాల్సి వచ్చింది. వీరి సుదీర్ఘ నిరీక్షణ నేపథ్యంలో, వారికి చెల్లించే జీతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్‌మన్ తెలిపిన వివరాల ప్రకారం, వ్యోమగాములకు ప్రత్యేకంగా ఓవర్‌టైమ్ జీతం ఉండదు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి, అంతరిక్షంలోని వారి సమయాన్ని భూమిపై సాధారణ పని దినంగానే పరిగణిస్తారు. ఐఎస్ఎస్ లో వారి ఆహారం, ఇతర ఖర్చులను నాసా భరిస్తుంది. వారికి సాధారణ జీతం యథావిధిగా అందుతుంది. అదనంగా రోజుకు 4 డాలర్లు (సుమారు రూ.347) చొప్పున వ్యక్తిగత ఖర్చుల కోసం చెల్లిస్తారు.
కోల్‌మన్ 2010-11లో 159 రోజుల మిషన్‌లో భాగంగా అదనంగా 636 డాలర్లు (రూ.55,000) అందుకున్నారు. అదేవిధంగా సునీతా విలియమ్స్, విల్మోర్ 287 రోజులు గడిపినందుకు అదనంగా ఒక్కొక్కరికి 1,148 డాలర్లు (సుమారు రూ.లక్ష) అందుతుంది. వ్యోమగాములు ఐఎస్ఎస్ లో పని చేస్తూనే ఉన్నారని, వారిని సాంకేతికంగా చిక్కుకుపోయినట్లుగా చూడలేమని నాసా పేర్కొంది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ GS-15 పే గ్రేడ్‌లో ఉన్నారు. జనరల్ షెడ్యూల్ (GS) వ్యవస్థలో ఇది అత్యున్నత స్థాయి. ఈ స్థాయి ఉద్యోగుల వార్షిక మూల వేతనం 1,25,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల వరకు (సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్ల వరకు) ఉంటుంది. తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్ లో ఉన్నందుకు వీరికి 93,850 డాలర్ల నుంచి 1,22,004 డాలర్ల వరకు (సుమారు రూ.81 లక్షల నుంచి రూ.1.05 కోట్ల వరకు) జీతం అందుతుంది. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఇచ్చే 1,148 డాలర్లను కలుపుకుంటే వారి మొత్తం ఆదాయం 94,998 డాలర్ల నుంచి 1,23,152 డాలర్ల వరకు (సుమారు రూ.82 లక్షల నుంచి రూ.1.06 కోట్ల వరకు) ఉంటుంది.
బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. నాసా ఇటీవల సహాయక మిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి తిరుగు ప్రయాణానికి మార్గం సుగమం అయింది.
తాజాగా స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ వ్యోమనౌకను మోసుకుంటూ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:33 గంటలకు) విజయవంతంగా నింగికి ఎగసింది. డ్రాగన్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఐఎస్ఎస్ కు చేరుకుంది.
నాసా స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్ నలుగురు కొత్త సిబ్బందితో ఐఎస్ఎస్ కు చేరుకుంది. ఇందులో నాసా వ్యోమగాములు అన్నే మెక్ క్లైన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా ఓనిషి, రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.