Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన

- కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన
- పవన్, లోకేశ్ ల మధ్య సమన్వయ లోపం ఉందంటూ భూమన విమర్శలు
- కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరో తేల్చాలని డిమాండ్
రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులను వెలికి తీయాలని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం అంటే హిందూ ధర్మం గుండెపై బుల్డోజర్లతో దాడి చేయడమేనని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అటవీ శాఖ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా, అటవీశాఖ అధికారులే కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టారని వెల్లడించారు. మరి, సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే పవనానంద స్వామి వారి గొంతుక ఇప్పుడెందుకు మూగబోయిందని భూమన నిలదీశారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్, ఇప్పుడు కాశినాయన క్షేత్రం విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
పైగా, మంత్రి నారా లోకేశ్ క్షమాపణ చెప్పడం, ఆయనే క్షేత్రాన్ని పునర్ నిర్మిస్తానని చెప్పడం వారి మధ్య వైరుధ్యాలకు నిదర్శనమని భూమన అన్నారు. సోషల్ మీడియాలో వీరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ రహస్యమేనని ఆయన గుర్తు చేశారు. గతంలో ఆలయాలను కూల్చిన వారే ఇప్పుడు కాశీనాయన క్షేత్రంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
టైగర్ జోన్ పరిధిలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తుంటే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారేమోనని అనుమానం కలుగుతోందని భూమన అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్షేత్రాన్ని అటవీ చట్టాల నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశాలు లేకుండానే కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు.
కూటమి పాలనలో హిందూ ధర్మానికి గడ్డుకాలం వచ్చిందని, వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడమే వారికి తెలుసని భూమన విమర్శించారు.