Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు 'ఆల్ ది బెస్ట్' చెప్పిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

- ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు
- టెన్త్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలన్న నారా లోకేశ్
- సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన
ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
ఈ క్రమంలో, రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నానని ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని లోకేశ్ సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలు పూర్తి చేయాలని అన్నారు.
కాగా, ఏపీలో ఈసారి పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,49,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు మొత్తం 6 సబ్జెక్టులకు గాను 7 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.