Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి

- 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం
- పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ప్రకటన
- ఉండవల్లిలోని తన నివాసంలో నివాళులు అర్పించిన చంద్రబాబు
ఆంధ్రా జాతిపిత, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండీ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆమరణ దీక్షతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడంటూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుచేశారు.
ఆయన ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మారక పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామంలో మ్యూజియం ఏర్పాటు, ఆధునిక ఉన్నత పాఠశాలను ఆయన పేరుతో నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని పైకి తేవాలని కోరారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు.. అంటే ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు.