Andhra Pradesh: టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

- రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు
- పదహారు రోజుల పాటు జరగనున్న ఎగ్జామ్స్
- ఏపీలో పరీక్ష రాయనున్న 6.5 లక్షల మంది విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మ.12:45 గంటల వరకు పరీక్ష జరగనుంది. పదహారు రోజుల పాటు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,49,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఎండలు విపరీతంగా పెరిగిపోవడంతో పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి సెంటర్ లో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పదో తరగతి హాల్ టికెట్ చూపించి ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పదో తరగతి విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి.