USA: తుఫాన్ బీభత్సం.. అమెరికాలో 34 మంది మృతి.. వీడియో ఇదిగో!

- పెనుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు
- వంద కి.మీ. వేగంతో వీచిన గాలులకు రోడ్లపై వాహనాలు బోల్తా
- మిన్నెసొటా, సౌత్ డకోటాలకు పొంచి ఉన్న మంచు తుఫాన్ ముప్పు
అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలు బోల్తాపడ్డాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 34 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. కెనడా నుంచి టెక్సస్ వైపు గంటకు 130 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
టోర్నడోల ధాటికి మిస్సోరీలో 12 మంది, ఆర్కన్సాస్‌లో ముగ్గురు, కాన్సాస్‌లో 8 మంది, మిస్సిస్సిప్పీలో ఆరుగురు, టెక్సస్‌లో నలుగురు మరణించారు. ఆర్కన్సాస్‌లో 29 మందికి పైగా గాయపడ్డారు. కార్చిచ్చులు చెలరేగడంతో ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సస్, కాన్సస్‌లలో ఆయా ప్రాంతాల నుంచి జనాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిన్నెసొటా, సౌత్ డకోటాలోని పలు ప్రాంతాలకు మంచు తుఫాన్ ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు.