Odisha: ఓ మాజీ ఎంపీకి తప్పని సామాజిక బహిష్కరణ

- కులాంతర వివాహం చేసుకున్న ఓడిశా రాష్ట్రం నబరంగ్‌పుర్ మాజీ ఎంపీ ప్రదీప్
- ప్రదీప్ కుటుంబాన్ని సంఘం నుంచి 12 ఏళ్ల పాటు బహిష్కరించిన గిరిజన భాద్ర సమాజ్ కేంద్ర కమిటీ
- తీర్పుకు కట్టుబడి ఉంటామన్న ప్రదీప్ సోదరుడు
స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా ఇంకా పలు ఏజన్సీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కుల కట్టుబాట్లు, కుల పెద్దల తీర్పులు కొనసాగుతున్నాయి. ఇందులో ఏ స్థాయిలో ఉన్న వారికి మినహాయింపులు ఉండటం లేదు. తాజా ప్రేమించిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ మాజీ ఎంపీ కుటుంబానికీ సామాజిక బహిష్కరణ వేటు తప్పలేదు.
ఈ ఘటన ఒడిస్సా రాష్ట్రంలో జరిగింది. గిరిజనేతర మహిళను వివాహం చేసుకున్న కారణంగా నబరంగ్‌పుర్ మాజీ ఎంపీ, బీజేపీ నేత ప్రదీప్ మఝీ కుటుంబాన్ని గిరిజన భాద్ర సమాజ్ కేంద్ర కమిటీ 12 ఏళ్ల పాటు సంఘం నుంచి బహిష్కరించింది.
కేంద్రపడా జిల్లాకు చెందిన సంగీతా సాహును ప్రదీప్ ఈ నెల 12వ తేదీన గోవాలో వివాహం చేసుకున్నాడు. గిరిజన భాద్ర సమాజ్ కేంద్ర కమిటీ దీనిపై స్పందించింది. గిరిజనేతర యువతిని ప్రదీప్ వివాహం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించినట్లు కమిటీ అధ్యక్షుడు టికాచంద్ తెలిపారు.
సామాజిక బహిష్కరణపై ప్రదీప్ సోదరుడు ప్రసన్న స్పందిస్తూ తమ కుటుంబంపై బహిష్కరణ వేటు గురించి మీడియా ద్వారా తెలిసిందని, అయితే తీర్పునకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ విషయంపై కమిటీ సభ్యులతో మాట్లాడతామని పేర్కొన్నారు.
ప్రస్తుత నాగరిక సమాజంలో కులాంతర, మతాంతర వివాహలతో పాటు ఖండాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ మాజీ ఎంపీ కుటుంబానికే సామాజిక బహిష్కరణ వేటు విధించడం హాట్ టాపిక్ అయింది.