Nitish Reddy: ఐపీఎల్‌లో ఆడేందుకు ఈ ఇండియన్ స్టార్‌కు లైన్ క్లియర్.. హైదరాబాద్ జట్టుకు శుభవార్త!

Nitish Reddy Cleared To Play IPL 2025 After Recovering From Injury

  • కండరాల గాయంతో బాధపడుతూ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన నితీశ్‌రెడ్డి
  • గాయం నుంచి కోలుకుని యో-యో టెస్టు పాసైన తెలుగు క్రికెటర్
  • నేడు ఎస్ఆర్‌హెచ్ ప్రీ టోర్నమెంట్ క్యాంప్‌లో జాయిన్ కానున్న ఆటగాడు
  • నితీశ్ రాకతో పెరిగిన హైదరాబాద్ బలం

ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇది శుభవార్తే. కండరాల గాయంతో బాధపడుతూ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన తెలుగు ఆటగాడు నితీశ్‌రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న నితీశ్‌.. యోయోటెస్టులో 18 స్కోరు సాధించి పాసయ్యాడు. దీంతో జట్టులో చేరికకు మార్గం సుగమమైంది. గత ఐపీఎల్‌ ఫైనల్‌లో కోల్‌కతా చేతిలో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. అయితే, ఈసారి మాత్రం జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. నితీశ్ రాకతో జట్టు మరింత బలపడింది.

ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఎస్ఆర్‌హెచ్ జట్టు రెడ్డిని అట్టేపెట్టుకుంది. నేడు ప్రారంభం కానున్న ప్రీటోర్నమెంట్ క్యాంప్‌లో నితీశ్‌రెడ్డి జాయిన్ అవుతాడు. గత ఐపీఎల్‌లో నితీశ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. 13 మ్యాచుల్లో 303 పరుగులు సాధించడంతోపాటు మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన నితీశ్.. ఎలాంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేశాడు. 

25 ఏళ్ల నితీశ్‌రెడ్డి బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

2023 సీజన్‌లో నితీశ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ పరుగులు సాధించలేకపోయాడు. వికెట్లు కూడా పడగొట్టలేకపోయాడు. అయితే, గత ఎడిషన్‌లో మాత్రం జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. జట్టు ఫైనల్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

  • Loading...

More Telugu News