Saidabad: వీడిన మిస్టరీ.. యాసిడ్ దాడి కేసులో ఆలయ అర్చకుడే ప్రధాన సూత్రధారి

- సైదాబాద్ భూలక్ష్మి ఆలయంలో అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి
- డబ్బులు, పూజా కార్యక్రమాల విషయంలో ఆలయ అర్చకుడికి, అకౌంటెట్‌కి మధ్య విభేదాలు
- తనకు తెలిసిన మరో పూజారితో యాసిడ్ దాడి చేయించిన అర్చకుడు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సైదాబాద్ భూలక్ష్మి ఆలయ అకౌంటెంట్ నర్సింగరావుపై శుక్రవారం రాత్రి జరిగిన యాసిడ్ దాడి కేసు మిస్టరీ వీడింది. ఆలయ అర్చకుడే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తేల్చినట్టు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్‌లోని భూలక్ష్మి ఆలయంలో పూజా కార్యక్రమాలు, డబ్బుల వసూళ్లలో అకౌంటెంట్ నర్సింగరావు, అర్చకుడు రాజశేఖర్‌శర్మ మధ్య గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో అకౌంటెంట్ నిత్యం అర్చకుడిపై నోరు పారేసుకునేవాడు. దీంతో ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని రాజశేఖరశర్మ నిర్ణయించుకున్నాడు.
షేక్‌పేటలో పూజారిగా పనిచేస్తున్న సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రాయికోడ్ హరిపుత్ర (31), రాజేశేఖరశర్మకు మధ్య గురుశిష్యుల బంధం ఉంది. దీంతో ఆయనను కలిసిన రాజశేఖరశర్మ అకౌంటెంట్‌పై యాసిడ్ దాడికి కుట్ర పన్నారు. శుక్రవారం రాత్రి ఆలయానికి వచ్చిన హరిపుత్ర.. అకౌంటెంట్‌తో మాట్లాడుతున్నట్టు నటించి ఒక్కసారిగా ఆయన తలపై యాసిడ్ పోసి పరారయ్యాడు. నిందితుడు పారిపోతూ డబ్బాను ఆలయ ఆవరణలో వదిలేశాడు. ఇది గమనించిన రాజశేఖరశర్మ డబ్బును బయటపడేయడం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. దీనిని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిన్న మధ్యాహ్నం ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.