WPL: డబ్ల్యూపీఎల్: రెండోసారి కప్పు ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ మూడో ‘సారీ’

Mumbai Indians To Record Second WPL Title Delhi Capitals Third Time Unlucky

  • ముంబైలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్
  • వరుసగా మూడోసారి ఫైనల్‌లో బోల్తాపడిన ఢిల్లీ జట్టు
  • ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్
  • నట్ స్కివర్ ఆల్ రౌండర్ ప్రతిభతో ముంబై విజయం

విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ అ‘ద్వితీయ’ విజయం సాధించింది. గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై రెండోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఢిల్లీ జట్టుకు వరుసగా మూడోసారికి కప్పు అందినట్టే అంది చేజారింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తోపాటు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు చూపిన తెగువ జట్టుకు విజయాన్ని అందించి పెట్టింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్యాటర్లు తడబడిన వేళ హర్మన్‌ప్రీత్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసింది. నట్ స్కివర్ బ్రంట్ 30 పరుగులు చేసింది. జట్టులో మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. బ్యాటింగ్ పిచ్‌పై 149 పరుగులు చేయడంతో ఢిల్లీ కేపిటల్స్ విజయం తథ్యమని అందరూ భావించారు. అయితే, ఆ స్కోరును కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. నట్ స్కివర్ బ్రంట్ బౌలింగ్‌లోనూ రాణించి కెప్టెన్ మెగ్ లానింగ్ (13) సహా మూడు కీలక వికెట్లు పడగొట్టింది. బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో బౌలర్లు విజయం సాధించారు. ఫలితంగా ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఢిల్లీ బ్యాటర్లలో మరిజానే కాప్ 40 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 30, నికీ ప్రసాద్ 25 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేదు. 

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయానికి దగ్గరగా వచ్చిన ఢిల్లీ 9 పరుగుల తేడాతో ఓటిమి పాలైంది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 14 పరుగులు కావాల్సి ఉండగా బంతిబంతికి ఉత్కంఠ నెలకొంది. నట్ స్కివర్ వేసిన తొలి బంతికి నికీ ప్రసాద్ ఒక్క పరుగు మాత్రమే తీసింది. రెండోబంతికి నల్లపురెడ్డి చరణి ఒక పరుగు తీసింది. దీంతో 4 బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి పరుగు రాలేదు. నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. ఇక, చివరి రెండు బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా, రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ వరుసగా మూడోసారి ఫైనల్‌లో బోల్తాపడింది. ముంబై వరుసగా రెండోసారి ట్రోఫీ దక్కించుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా హర్మన్‌ప్రీత్ కౌర్, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నట్ స్కివర్ బ్రంట్ అవార్డులు అందుకున్నారు.

  • Loading...

More Telugu News