Revanth Reddy: కుటుంబాన్ని, పిల్లల్ని తిట్టారని రేవంత్ రెడ్డి బాధపడుతున్నారు... కానీ...!: కవిత

Kavitha demands for Revanth Reddy apology

  • భారతదేశంలో కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతామన్న కవిత
  • రేవంత్ రెడ్డి చేసిందే ఆయనకు తిరిగి వచ్చిందని వ్యాఖ్య
  • కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్

తనను, తన కుటుంబాన్ని, తన పిల్లలను తిట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బాధపడ్డారని, కానీ గత ఐదారేళ్లుగా వారు చేసిన పనే ఈరోజు ఆయన మీదకు తిరిగి వెళ్లిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. భారతదేశంలో కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతామని, మనం చేసింది మనకు తిరిగి వస్తుందని భావిస్తుంటామని పేర్కొన్నారు. అందుకే రేవంత్ రెడ్డి చేసింది ఆయనకు వాపస్ (తిరిగి) వచ్చిందని పేర్కొన్నారు.

ఆయన మొదలుపెట్టిన విష సంస్కృతి తిరిగి ఆయన మెడకే చుట్టుకుందని ఆమె అన్నారు. తద్వారా, మనం ఏది చేస్తామో అదే తిరిగి వస్తుందని ముఖ్యమంత్రి విషయం ద్వారా మనకు రుజువైందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులం హుందాగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అందుకే, కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాత మాట్లాడదామని చెప్పామని వెల్లడించారు.

కానీ అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదని ఆయన తెలిపారు. ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారని, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఎవరైనా సరే నేను బట్టలూడదీసి బజారులో ఊరేగిస్తా'నని రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ రోజు చరిత్రలో బ్లాక్ డే అని ఆమె అన్నారు. తన కుటుంబాన్ని తిడుతున్నారని చెబుతూనే, ఆయన ప్రయోగిస్తున్న భాష సరిగ్గా లేదని అన్నారు. యథా రాజా తథా ప్రజ కాబట్టి మీరు మాటలు మాట్లాడటం ఆపివేయాలని సూచించారు.

శాసనమండలిలో గవర్నర్ ప్రసంగ తీర్మానానికి ధన్యవాదాలు చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలికి వచ్చారని చెప్పారు. ఆ సమయంలో, కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులం ఆయనను డిమాండ్ చేశామని తెలిపారు. కానీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారికి కూడా కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ మీద మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తన హుందాతనాన్ని పెంచుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News