Uttam Kumar Reddy: ఏపీ నిర్మించ తలపెట్టిన ఆ పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఈ అంశంపై కేంద్రాన్ని పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
- తెలంగాణలో కీలక సమయంలో అధికారంలోకి వచ్చామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను నిరాకరించిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయమని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతలను నిర్మించాలని భావించిందని ఆయన అన్నారు.
అయితే, అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందంటూ పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదులు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ముఖ్య కార్యదర్శి రాహల్ బొజ్జా కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని అన్నారు. పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారని పేర్కొన్నారు.
తెలంగాణలో కీలక సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో వాటాను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుందని చెప్పారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్రంగా వివరించినట్లు చెప్పారు. ఫిబ్రవరి 27న జరిగిన 25వ సమావేశంలో ఎన్జీటీ ఉత్తర్వులను సమీక్షించి నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించిందని తెలిపారు. కృష్ణా జలాశయాల్లో తెలంగాణ హక్కు కోల్పోకుండా చూడటంతో పాటు విధానపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.