Revanth Reddy: మరోసారి నేనే ముఖ్యమంత్రి అవుతాను: రేవంత్ రెడ్డి

- మొదటిసారి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఓటు వేశారన్న రేవంత్ రెడ్డి
- రెండోసారి మా మీద నమ్మకంతో ఓటు వేస్తారన్న ముఖ్యమంత్రి
- ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజల వద్దకు వెళతామని వెల్లడి
తాను మరోసారి ముఖ్యమంత్రిని అవుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శాసనమండలి వాయిదాపడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మొదటిసారి బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఓటు వేశారని, రెండోసారి మా మీద నమ్మకంతో ఓటేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల నమ్మకాలను నిలబెట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజల వద్దకు వెళతామని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు అని ఆయన వెల్లడించారు. పనిని నమ్ముకొని తాము ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమకు స్టేచర్ కంటే స్టేట్ ఫ్యూచర్ ముఖ్యమని స్పష్టం చేశారు.
ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు. హామీ ఇచ్చినట్లుగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తామని, వారు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు కాంగ్రెస్ పార్టీకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే తమ విధానమని అన్నారు.