Ashwini Vaishnaw: తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

- తమిళం మధురమైన భాష అన్న కేంద్ర మంత్రి
- తమిళంతో పాటు ప్రతి భాషను ఆస్వాదిద్దామన్న కేంద్ర మంత్రి
- మన ప్రధాన మంత్రి అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య జాతీయ విద్యావిధానం అమలు విషయంలో వివాదం నెలకొన్న సమయంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈరోజు తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, తమిళం మధురమైన భాష అని అన్నారు.
తమిళం చాలా మధురమైన భాష, మనమంతా తమిళ సంస్కృతిని గౌరవిస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశానికి, ఈ ప్రపంచానికి అందిన ఆస్తుల్లో తమిళం ఒకటి అన్నారు. అన్ని భారతీయ భాషలను ఆస్వాదిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రధాన మంత్రి అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారన్నారు. ప్రతి భారతీయ భాషకు ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు.
అదే సమయంలో మన మధ్య స్నేహాలు, సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. మొత్తంగా దేశాన్ని ఐక్యంగా, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుకోవడం, ప్రపంచం మన శక్తిని గుర్తించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలను కలిగి ఉండాలని ఆయన అన్నారు.