Pawan Kalyan: హిందీ తప్పనిసరి అని అందులో ఎక్కడా చెప్పలేదు: పవన్ కల్యాణ్

- నిన్న జయకేతనం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
- సోషల్ మీడియాలో స్పందించిన జనసేనాని
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు
జాతీయ, సాంస్కృతిక సమైక్యతను సాధించడంలో భాషను బలవంతంగా రుద్దడం లేదా గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ సహాయపడవని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను హిందీ భాషకు వ్యతిరేకం కాదని, దానిని తప్పనిసరి చేయడాన్నే వ్యతిరేకించానన్నారు. జాతీయ విద్యా విధానం-2020లో హిందీని తప్పనిసరి చేయనప్పుడు, బలవంతంగా రుద్దుతున్నారంటూ అసత్య కథనాలు వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు.
"జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం, విద్యార్థులకు ఒక విదేశీ భాష, తమ మాతృభాషతో సహా రెండు భారతీయ భాషలను నేర్చుకునే అవకాశం ఉంది. హిందీ నేర్చుకోవడానికి ఇష్టం లేనివారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలీ, ఉర్దూ లేదా ఇతర భారతీయ భాషలను ఎంచుకోవచ్చు.
బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇవ్వడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని పరిరక్షించడానికి రూపొందించారు. రాజకీయ ఎజెండాల కోసం ఈ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, నేను వైఖరిని మార్చుకున్నానని చెప్పడం కేవలం అవగాహన లేమిని ప్రతిబింబిస్తుంది. భాషా స్వేచ్ఛ, ప్రతి భారతీయుడికి విద్యా స్వేచ్ఛ అనే సూత్రానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.