Amit Shah: జైల్లో నా పట్ల కఠినంగా వ్యవహరించారు: అమిత్ షా

- ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా
- వారం రోజులు జైల్లో ఉంటే భౌతికంగా దాడి చేశారన్న అమిత్ షా
- కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్బంధాలను ఎదుర్కొన్నామన్న కేంద్ర మంత్రి
- బీజేపీ అధికారంలోకి వచ్చాక అసోంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయన్న అమిత్ షా
ఇందిరాగాంధీ హయాంలో ఆమెకు వ్యతిరేకంగా విద్యార్థులమంతా కలిసి ఆందోళన నిర్వహించామని, ఆ సమయంలో తాను వారం రోజులు జైల్లో ఉన్నానని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తన పట్ల కఠినంగా వ్యవహరించారని, తనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అసోంలోని డెర్గావ్‌లో గల లచిత్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అసోంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్బంధాలను ఎదుర్కొన్నానని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసోంలో శాంతికి ఏమాత్రం కృషి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని అన్నారు. పది వేల మంది యువత ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. మొఘలుల దాష్టీకాలను, సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్న లచిత్ బర్ఫుకాన్ పేరును పోలీస్ అకాడమీకి పెట్టడం హర్షణీయమన్నారు. చరిత్రను కేవలం అసోంకు మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా తెలియజేయాల్సి ఉందని అన్నారు.