Chandrababu: 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను జగన్ వారసత్వంగా ఇచ్చి వెళ్లారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu criticises Jagan over garbage issue

  • పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
  • స్థానికులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం చంద్రబాబు
  • జగన్ కనీసం మురికి కాలువల్లో పూడిక కూడా తీయించలేదని విమర్శలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇవాళ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం మురికి కాలువల్లో పూడిక కూడా తీయించలేదని విమర్శించారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను జగన్ వారసత్వంగా ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తన జీవితాశయం అని స్పష్టం చేశారు. 

ప్రజల ఆహార అలవాట్లు మారడంతో వ్యాధులు పెరిగాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని రకాల జబ్బులకు ఖరీదైన చికిత్స అవసరమవుతోందని తెలిపారు. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. 

స్వర్ణాంధ్ర-2047 పేరుతో స్పష్టమైన విధానం తీసుకువచ్చామని... అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. 

గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏపీ అన్ని విధాలా విధ్వంసానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసి వెళ్లిందని, ఇప్పుడా అప్పులు తీర్చడంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News