Ambati Rambabu: నాయకులు ప్రజల్లోంచి పుట్టాలన్నాడు.... ఎమ్మెల్సీని మాత్రం అన్నకు ఇచ్చుకున్నాడు: అంబటి

- జయకేతనం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి ప్రెస్ మీట్
- పవన్ ను ఊసరవెల్లితో పోల్చిన అంబటి
- పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు
పిఠాపురం మండలం చిత్రాడలో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఊసరవెల్లి లాంటి వాడని, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
గతంలో నాయకులు ప్రజల్లోంచి పుట్టాలన్న పవన్... ఇప్పుడు ఎమ్మెల్సీని తన అన్నకు ఇచ్చుకున్నాడని ఆరోపించారు. కుటుంబ, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్న పవన్... ఇప్పుడు అన్నకు ఎలా లబ్ధి చేకూర్చాడని ప్రశ్నించారు. గతంలో ఉత్తరాది వారి అహంకారం ఏమిటి? ఉత్తరాది వారు పెత్తనం చలాయించడం ఏంటి? అని చించుకున్న పవన్ కల్యాణ్... ఇప్పుడు ఉత్తరాది వారిని కాపాడడం కోసం ఓ సైనికుడిలా తయారయ్యాడని విమర్శించారు.
షణ్ముఖ వ్యూహం అంట... అదేంటో తనకు అర్థం కావడంలేదని అంబటి అన్నారు. ఒక్కో వ్యూహం మార్చుకుంటూ వెళుతుండడమేనా షణ్ముఖ వ్యూహం అని వ్యాఖ్యానించారు.
"మొదటేమో ఎర్ర కండువా వేసున్నాడు... మళ్లీ కాషాయ రంగు కండువా వేసుకున్నాడు. ఎందుకు అలా వ్యూహం మార్చాడనేది, ఎందుకు అలా సిద్దాంతం మార్పు చెందుతూ వచ్చిందనేది చెప్పాలి కదా. ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి కదా... సెటిల్ అవ్వడంలేదు... గాలికి కొట్టుకుపోతున్నాడు. అప్పట్లో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం రావాలి అన్నాడు... మీకు గుర్తుందోలేదో కానీ.... మా వాడు అడవుల్లోకి వెళ్లిపోతాడేమోనని భయపడ్డామండీ అన్నాడు" అని అంబటి వివరించారు.
ఇక, బాలినేని వంటి నేతలను నమ్ముకుని పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే గోవిందా గోవింద అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.