Dr Byreddy Shabari: బైరెడ్డి అంటే నేను... సిద్ధార్థ్ రెడ్డి కాదు: బైరెడ్డి శబరి

- అక్క అని కూడా చూడకుండా తనపై కేసులు పెట్టించారని మండిపడ్డ శబరి
- ఆడుదాం ఆంధ్రలో అవినీతి బయటకు వస్తుందని వ్యాఖ్య
- సిద్ధార్థ రెడ్డికి ఫుల్ బాటిల్ వేయడం అలవాటయినట్టుందని విమర్శ
వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి అంటే తానేనని... సిద్ధార్థ రెడ్డి కాదని అన్నారు. కేసులు, అరెస్టుల గురించి బైరెడ్డి మాట్లాడుతున్నారని... అక్క అని కూడా చూడకుండా తనపై కేసులు పెట్టించారని... తమ కార్యకర్తలపై దాడులు చేయించారని మండిపడ్డారు. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో... ఇక్కడ కూడా అదే చేస్తున్నారని అన్నారు. సిద్ధార్థ రెడ్డికి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రావడం లేదని... అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
తొమ్మిది నెలల నుంచి సిద్ధార్థ రెడ్డి ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. సిద్ధార్థ రెడ్డికి ఫుల్ బాటిల్ వేయడం అలవాటు అయినట్టుందని చెప్పారు. జగన్ మళ్లీ రావాలని అంటున్నారని... కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి మళ్లీ రావాలని కోరుకుంటున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని... సినిమాల్లో ట్రై చేస్తే బెటర్ అని చెప్పారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతి బయటకు వస్తుందని... అవినీతి చేసినవారికి శిక్ష తప్పదని అన్నారు. తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.