BRS: రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

- కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారన్న ప్రశాంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడారని ఆగ్రహం
- కేసీఆర్ మీద అక్కసుతో ఛాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ మీద అక్కసుతో ఆయనకు ఛాంబర్ కూడా కేటాయించలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు సూచించిన వారికి పీఏసీ చైర్మన్ పదవిని ఇవ్వాలని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనవాయతీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను సంప్రదించకుండానే పీఏసీ చైర్మన్‌ను నియమించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ప్రతిపక్ష నేతకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది వ్యాఖ్యానించారు.