IPL: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసింది వీరే!

- 8 సెంచరీలతో అగ్రస్థానంలో కోహ్లీ
- 7 శతకాలు బాదిన బట్లర్
- వీరిద్దరి తర్వాత 6 సెంచరీలతో క్రిస్ గేల్ మూడో స్థానం
- చెరో 4 సెంచరీలు సాధించిన గిల్, కేఎల్ రాహుల్
ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు మరో మెగా క్రికెట్ ఈవెంట్ కనువిందు చేయనుంది. బ్యాటర్లు బౌండరీలతో విరుచుకుపడే ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
- ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. టోర్నీ ఆరంభ ఎడిషన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కే ఆడుతున్న ఈ రన్‌మెషీన్ ఆ జట్టు తరఫున 252 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 8,004 రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 113(నాటౌట్).
- విరాట్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఉన్నాడు. ఇప్పటివరకు 7 శతకాలు బాదాడు. మొత్తం 107 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 3,582 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 124. మొన్నటివరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన అతడు.. ఈసారి గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
- బట్లర్ తర్వాత అత్యధిక సెంచరీలు బాదింది క్రిస్ గేల్. 142 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన యూనివర్సల్ బాస్ 6 శతకాలు నమోదు చేశాడు. మొత్తంగా 4,965 రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 175(నాటౌట్).
- ఇక టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 4 సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 129. మొత్తం 103 మ్యాచ్‌లలో 3,216 రన్స్ చేయడం విశేషం.
- అలాగే కేఎల్ రాహుల్ కూడా 4 శతకాలు బాదాడు. 132 ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ 4,683 రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 132(నాటౌట్). గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడిన అతడు.. ఈ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు.
- ఆసీస్ మాజీ ఆటగాళ్లు షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లు సైతం తమ ఐపీఎల్ కెరీర్ లో 4 సెంచరీలు చొప్పున సాధించారు.
- భారత జట్టు టీ20 ప్లేయర్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో 3 శతకాలు బాదాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజూ ఇప్పటివరకు 168 ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 4,419 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 119.
- సంజూతో పాటు ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా 3 సెంచరీలు నమోదు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 133(నాటౌట్). మొత్తం 184 మ్యాచ్‌లు ఆడి 5,162 రన్స్ చేశాడు.