IPL: 17 సీజన్లలో ఐపీఎల్ విజేతలు.. ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లు... డీటెయిల్స్ ఇవిగో..!

- మరో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం
- మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025
- 2008లో ప్రారంభమైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
- 17 సీజన్లు పూర్తి... ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు అత్యధిక టైటిళ్లు
- ఇప్పటివరకు ట్రోఫీ గెలవని ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్
మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కు తెరలేవనుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేందుకు ప్రపంచ క్రికెట్ ఆటగాళ్లు ఎంతో ఉత్సుకత చూపిస్తుంటారనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఇతర దేశాల టీ20 లీగ్స్ కంటే ఐపీఎల్‌లో ఆడితే అధిక మొత్తం ప్లేయర్లకు దక్కుతుంది. ఇంకా చెప్పాలంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు కూడా.
ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీ ఈ ఏడాదితో 18వ సీజన్‌లో అడుగు పెడుతోంది. ప్రస్తుతం ఈ టోర్నీ పది జట్లను కలిగి ఉంది. 2008 నుంచి 2022 వరకు ఎనిమిది జట్లు మాత్రమే ఉన్నాయి. 2023లో రెండు కొత్త జట్లు చేరాయి. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది. కాగా, గడిచిన 17 ఎడిషన్లలో ఏ జట్లు విజేతగా నిలిచాయి, ఏ టీమ్ అత్యధిక సార్లు టైటిల్ కైవసం చేసుకుంది, అసలు ఐపీఎల్ ట్రోఫీ గెవలని జట్లు ఏవీ? తదితర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2008లో జరిగిన ప్రారంభ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు టైటిళ్లను గెలుచుకున్నాయి. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్) ఒక్కో టైటిల్ గెలుచుకున్నాయి. అయితే, ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ట్రోఫీ గెలవలేదు. టోర్నీ ప్రారంభ సీజన్ నుంచి ఉన్న బెంగళూరు ప్రతిసారి భారీ అంచనాలతో బరిలోకి దిగి, చివరికి ఒట్టిచేతులతోనే వెనుదిరుగుతోంది. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జట్టు ఈసారైనా టైటిల్ గెలుస్తుందేమో చూడాలి.
2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ విజేతల జాబితా ఇదే..
2008- రాజస్థాన్ రాయల్స్
2009- డెక్కన్ ఛార్జర్స్
2010- చెన్నై సూపర్ కింగ్స్
2011- చెన్నై సూపర్ కింగ్స్
2012- కోల్‌కతా నైట్ రైడర్స్
2013- ముంబయి ఇండియన్స్
2014- కోల్‌కతా నైట్ రైడర్స్
2015- ముంబయి ఇండియన్స్
2016- సన్‌రైజర్స్ హైదరాబాద్
2017- ముంబయి ఇండియన్స్
2018- చెన్నై సూపర్ కింగ్స్
2019- ముంబయి ఇండియన్స్
2020- ముంబయి ఇండియన్స్
2021- చెన్నై సూపర్ కింగ్స్
2022- గుజరాత్ టైటాన్స్
2023- చెన్నై సూపర్ కింగ్స్
2024- కోల్‌కతా నైట్ రైడర్స్
కాగా, మార్చి 22న ప్రారంభమయ్యే ఐపీఎల్ 18వ సీజన్ మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనున్నాయి.