Varun Chakravarthy: భారత్‌కు రావొద్దని నన్ను బెదిరించారు.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. వరుణ్ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

- ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ అద్భుత ప్రదర్శన
- టీమిండియా టైటిల్ గెలవడంలో మిస్టరీ స్పిన్నర్ కీరోల్
- అయితే, 2021 టీ20 ప్రపంచ కప్‌లో వరుణ్ నిరాశజనక ప్రదర్శన
- దాంతో తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని వెల్లడి
- బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానన్న వరుణ్ చక్రవర్తి
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. నాకౌట్ మ్యాచ్‌లలో కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకంగా మారాడు. భారత జట్టు పుష్కరకాలం తర్వాత టైటిల్ గెలవడంలో చక్రవర్తి తనవంతు పాత్ర పోషించాడు.
అయితే, 2021 టీ20 ప్రపంచ కప్‌లో నిరాశజనక ప్రదర్శన కారణంగా తనకు భారత్‌కు రావొద్దని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని వరుణ్ చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "స్వదేశానికి రావొద్దని నన్ను బెదిరించారు. చెన్నై వచ్చాక కూడా విమానాశ్రయం నుంచి ఎవరో నన్ను బైక్‌పై ఇంటివరకూ ఫాలో అయ్యారు. అది నాకు చాలా కష్టమైన దశ. నమ్మకంతో జట్టుకు సెలక్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చాలా బాధపడ్డాను. అభిమానులు చాలా భావోద్వేగానికి గురవుతున్నారని నాకు అర్థమైంది" అని వరుణ్ చక్రవర్తి షాకింగ్ వివరాలను వెల్లడించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుణ్ చక్కటి ప్రదర్శనతో 2021 టీ20 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యాడు. కానీ, ఐసీసీ టోర్నీలో రాణించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో భారత్ సూపర్ 12 దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో అతడు ఒక్క వికెట్ కూడా తీయలేదు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సమయం తనకు ఎంతో కఠినంగా గడిచిందని తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు. అది తనకు చీకటి సమయం అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు.
"2021 ప్రపంచ కప్ నాకు చీకటి సమయం. అప్పుడు నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. నేను చాలా హైప్‌తో జట్టులోకి వచ్చాను. కానీ, నాకు ఒక్క వికెట్ కూడా రాలేదు. ఆ తర్వాత నన్ను మూడు సంవత్సరాల పాటు సెలక్టర్లు జట్టు ఎంపికలో పరిగణించలేదు" అని యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు.