Hijab: డ్రోన్లతో మహిళలపై నిఘా పెడుతున్న ఇరాన్.. కారణం ఇదే..!

Iran Using Drone Facial Recognition Software and App to Monitor Women Without Hijab

  • హిజాబ్ ధరించకుండా బయటకు అడుగుపెడితే అంతే..
  • వాహనాల్లోనూ మహిళలు హిజాబ్ ధరించాల్సిందే
  • డ్రోన్ల ద్వారా గుర్తించి వాహన యజమానికి హెచ్చరికలు

హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మహిళలపట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మోరల్ పోలీసులను నియమించిన ప్రభుత్వం.. తాజాగా హిజాబ్ ధరించకుండా బయటకు అడుగుపెట్టే మహిళలను గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తోందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. వీధుల్లో డ్రోన్లను ఏర్పాటు చేసి మరీ మహిళలను హెచ్చరిస్తోంది. హిజాబ్ లేకుండా మహిళలు బయట కనిపిస్తే చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా నజర్ పేరుతో ఓ యాప్ ను తీసుకొచ్చింది. టెహ్రాన్ లోని అమిర్ కబిర్ యూనివర్సిటీ ఇందుకోసం వర్సిటీ ప్రవేశద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ను అమర్చింది. తద్వారా వర్సిటీ విద్యార్థులు హిజాబ్ లేకుండా లోపలికి వస్తే గుర్తించి హెచ్చరించడం, చర్యలు తీసుకోవడం చేస్తోంది.

2022లో హిజాబ్ వ్యతిరేక ఆందోళన చేపట్టిన మహసా అమినిని మోరల్ పోలీసులు అరెస్టు చేయగా.. కస్టడీలో అమిని చనిపోవడం ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రత్యేకంగా డ్రోన్లను రంగంలోకి దింపి హిజాబ్ ధరించని మహిళలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆకాశంలో ఎగురుతూ వీధులపై నిఘా పెట్టే ఈ డ్రోన్ల సాయంతో హిజాబ్ ధరించకుండా బయటకు వచ్చే మహిళలను పోలీసులు గుర్తిస్తారు. డ్రోన్ కెమెరాల్లోని ఫేసియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా మహిళలను గుర్తించి వారి ఫోన్లకు హెచ్చరికలు పంపిస్తారు. వాహనాల్లో మహిళలు హిజాబ్ లేకుండా కనిపిస్తే సదరు వాహనదారుడికి వెంటనే సందేశం పంపించి హెచ్చరిస్తారు. అప్పటికీ వినకుంటే ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేస్తారని యూఎన్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News