YS Sunitha Reddy: వైఎస్ వివేకా హత్య జరిగి ఆరేళ్లు అయింది.. మాకు ఇంకా న్యాయం జరగలేదు: సునీత

- పులివెందులలో వివేకా సమాధి వద్ద నివాళి అర్పించిన సునీత
- హత్య కేసు నిందితుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన సునీత
- న్యాయం జరిగేంతవరకు పోరాడుతూనే ఉంటానని వ్యాఖ్య
తన తండ్రి వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత నివాళి అర్పించారు. పులివెందులలోని వివేకా సమాధి వద్ద నివాళి అర్పించి, ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివేకా హత్య జరిగి ఆరేళ్లయిందని... ఈ కేసులో ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని చెప్పారు. నిందితుల్లో ఒకరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు.
కేసులో నిందితుల కంటే తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్టు అనిపిస్తోందని సునీత చెప్పారు. సాక్షులు వరుసగా చనిపోతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందని అన్నారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 14వ తేదీన రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో వివేకా ప్రచారం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని ఇంటికి వచ్చారు. మరుసటి రోజు తెల్లారేసరికి తన ఇంట్లో హత్యకు గురై కనిపించారు. వివేకా హత్యకు గురికాగా... తొలుత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదే ఏడాది మే 30న జగన్ సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం కాకముందు సీబీఐ విచారణ అంటూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్... సీఎం అయిన తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో సునీత సీబీఐ విచారణను కోరారు.