Nadendla Manohar: పవన్ ను ఇబ్బందులకు గురిచేసిన ఆ రోజులు మర్చిపోలేం: నాదెండ్ల మనోహర్

- నేడు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ
- పిఠాపురం మండలం చిత్రాడ వద్ద జయకేతనం సభ
- హాజరైన నాదెండ్ల మనోహర్
- తనతో పాటు నడిచిన ప్రతి ఒక్కరినీ పవన్ గౌరవించారని వెల్లడి
- జనసేన ఎప్పుడూ ఒకేలా ఉందని ఉద్ఘాటన
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలోని చిత్రాడ వద్ద ఏర్పాటు చేశారు. జయకేతనం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు లక్షలాదిగా జనసైనికులు, వీరమహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. నాడు మన నాయకుడు పవన్ ను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఆ రోజులను మర్చిపోలేమని అన్నారు. కష్ట సమయంలో... ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని నాదెండ్ల పేర్కొన్నారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరినీ పవన్ గౌరవించారని వెల్లడించారు.
జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని గుర్తుచేశారు. ఇవాళ జనసేన పార్టీలో 12.32 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని నాదెండ్ల తెలిపారు. ఎంతో కష్టమైన ప్రస్థానంలో, అనేక అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నామని వివరించారు. నాడు రాజమండ్రిలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు... ఎక్కడ్నించి వచ్చారో కానీ లక్షల మంది జనం వచ్చి పవన్ కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.
"జనసేన పార్టీ ఎప్పుడూ ఒకేలా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు మరో విధంగా లేము. 2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా అనే సందర్భంలోనూ కార్మికులకు భరోసా ఇచ్చాం. విలువలతో కూడిన రాజకీయం చేశారు కాబట్టే పవన్ ను ప్రజలు నమ్మారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ అదేమీ టెక్నికల్ ఫిగర్ కాదు, స్టాటిస్టికల్ పాయింట్ అంతకన్నా కాదు... అది పవన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం.
అమరావతి రైతులు ఆందోళన చెందుతుంటే నిలబడింది ఎవరు? ఢిల్లీకి వెళ్లి ఆ రోజు మొట్టమొదటిసారిగా బీజేపీ నేతలతో సమావేశమై... మీరు ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలి, రైతాంగాన్ని రక్షించాలి... రాజధాని కోసం ఉదారంగా భూములు ఇచ్చిన రైతులు, మహిళలపరిస్థితి పట్ల మీరు ఎందుకు స్పందించరు అని పవన్ కల్యాణ్ ఆ రోజునే వారిని అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన ఐదో రోజున పవన్ కల్యాణ్ పార్లమెంటుకు వెళ్లి అమిత్ షాతో చాలా గట్టిగా మాట్లాడి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకవరణ చేయొద్దని స్పష్టం చేశారు.
మనం ఏ విధంగా ముందుకు వెళ్లామో ఆలోచించాలి... ఒక సీటు కోసమో, పదవి కోసమో కాదే. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేం ఉన్నామంటే, అది మీకు సేవలు అందించడం కోసమే. మన జనసైనికుల్లో కూడా ఒక ఆలోచన రావాలి... మార్పు కోరారు మీరు... ఆ మార్పును నిలబెట్టుకోవాలి.
కూటమి ప్రభుత్వం అన్నాక కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి... కానీ మనకు బాధ్యత కూడా పెరిగింది. ఇతర పార్టీలకన్నా మన నాయకుడికి, మన నేతలకు, మన జనసైనికులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఆ రోజు ఆయన ఇప్పటం గ్రామంలో ప్రతిజ్ఞ చేశారు. దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం.
దయచేసి పార్టీ శ్రేణులు చిన్న చిన్న విషయాలకు గొడవపడొద్దు. మన కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాలి. గత ప్రభుత్వ ఐదేళ్లలో పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి కష్ట సమయంలో మీరు తోడుగా ఉండాలి" అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.