Chamala Kiran Kumar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చిన గుర్తింపు, బీజేపీలో లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamala Kiran Kumar Reddy says Maheshwar Reddy is not getting honour in BJP

  • కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను సాగిస్తోందని విమర్శ
  • పదకొండేళ్లుగా బీజేపీ ఏం చేసిందని నిలదీత
  • తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపణ

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు, బీజేపీలో లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను సాగిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకుంటే రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని అన్నారు. బీజేపీలో గుర్తింపు కోసమే ఆయన 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసింది, ఏం హామీలను అమలు చేసిందో చెప్పాలని నిలదీశారు. చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నందుకు మొదట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించాలని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఇప్పటి వరకు ఇందులో తెలంగాణ వాటా 80 లక్షలు రావాలని, అవి ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు.

బడాబాబులకు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, కానీ పేదవారి అకౌంట్లలో రూ.15 లక్షలు మాత్రం పడలేదని అన్నారు. తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ఆయన అన్నారు. ఈ నెల 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కావాలని, తెలంగాణ రాష్ట్రం తరఫున నిలబడాలని అన్నారు.

  • Loading...

More Telugu News