Honey Trap: 'నేహా' ఉచ్చులో పడి రక్షణ రంగ సమాచారం లీక్ చేసిన ఉద్యోగి అరెస్ట్

Defense Department employee caught in honey trap

  • ఫేస్ బుక్ లో మహిళ పరిచయం
  • మహిళ వలలో పడి ఐఎస్ఐకి సమాచారం లీక్
  • ఫిరోజాబాద్‌లో ఆర్డినెన్స్ ఉద్యోగి అరెస్ట్

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే రవీంద్ర కుమార్ అనే రక్షణ శాఖ ఉద్యోగి హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఎఐకి కీలక సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణలపై అతన్ని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపిన వివరాల ప్రకారం... రవీంద్ర కుమార్ అనే ఉద్యోగి 'నేహా శర్మ' అనే మారు పేరుతో ఉన్న ఓ మహిళ ద్వారా ఐఎస్ఐఎకి సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తించారు. గగన్‌యాన్ అంతరిక్ష ప్రాజెక్ట్, మిలిటరీ లాజిస్టిక్స్-డెలివరీ డ్రోన్ ట్రయల్స్‌కు సంబంధించిన రహస్య వివరాలను కూడా అతను చేరవేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రవీంద్ర కుమార్‌కు సహకరించిన మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా నేహా శర్మతో రవీంద్ర కుమార్‌ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది. ఆన్‌లైన్ స్నేహం కాస్తా... వ్యక్తిగత విషయాలు, దేశ రహస్యాలు పంచుకునే వరకు చేరింది. ఈ క్రమంలోనే రవీంద్ర కుమార్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని నేహాతో పంచుకున్నాడు.

హనీ ట్రాప్ పద్ధతులను ఉపయోగించి ఐఎస్ఐ మహిళా ఏజెంట్లు పురుషులను ఆకర్షిస్తారని, వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తారని ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపారు. రవీంద్ర కుమార్ తన ఫోన్‌ కాంటాక్ట్ లిస్టులో ఆ మహిళ నెంబర్ ను 'చందన్ స్టోర్ కీపర్ 2' పేరుతో సేవ్ చేసుకున్నాడని చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో అన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, రక్షణ సంబంధిత సంస్థల్లో భద్రతా ప్రోటోకాల్స్‌ను కఠినతరం చేయాలని, ఉద్యోగులపై నిఘా ఉంచాలని ఏటీఎస్ ఆదేశించింది.

  • Loading...

More Telugu News