Donald Trump: కిమ్ జోంగ్ ఉన్ తో ఇప్పటికీ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి: డొనాల్డ్ ట్రంప్

- కిమ్ ఒక అణుశక్తి అన్న డొనాల్డ్ ట్రంప్
- మనం అణ్వాయుధాలను తగ్గించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- ఉత్తరకొరియా, ఇండియా, పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న ట్రంప్
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిమ్ తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కానీ, కిమ్ ఒక అణుశక్తి అని వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని... వాటి శక్తి చాలా ఎక్కువని ట్రంప్ చెప్పారు. మనం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగితే అది గొప్ప విజయం అవుతుందని అన్నారు. అణ్వాయుధాలను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉత్తరకొరియా, ఇండియా, పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఉత్తరకొరియా అణ్వాయుధాల విధానంలో ఎలాంటి మార్పునైనా సూచిస్తున్నాయా? అనే ప్రశ్నకు వైట్ హౌస్ అధికారి మాట్లాడుతూ... ట్రంప్ తన తొలి పదవీకాలంలో చేసినట్టుగానే ఉత్తరకొరియాను అణ్వాయుధ రహితంగా చేస్తారని చెప్పారు. ట్రంప్ తన తొలి పదవీకాలంలో కిమ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.