Chandrababu: నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

- మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడి
- పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు అని స్పష్టీకరణ
- పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలు పంపాలని నేతలకు ఆదేశం
ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం... పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలను నేతలు అందజేయాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమిస్తామని వెల్లడించారు.
కాగా, నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటివరకు 60 వేల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దరఖాస్తు పంపిన మొదటిసారే పదవి రాలేదని అనుకోవద్దని, రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగతా వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు తీసుకున్న వారి పనితీరును పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నారో, ఇప్పుడూ అంతే హుందాగా వ్యవహరించాలని సూచించారు. టీడీపీ నేతలు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు. నేను ఈ విధంగా చెబుతుంటే... వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని ఉద్ఘాటించారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని వ్యాఖ్యానించారు.
గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదేనని వివరించారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలని సూచించారు. కూటమిలోని మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.