Russia-Ukrain War: కాల్పుల విరమణ పుతిన్‌కు ఇష్టం లేదు.. ఆ విషయం ట్రంప్‌కు చెప్పాలంటే ఆయనకు భయం: జెలెన్‌స్కీ

Zelensky Says Putin Does Not Want Ceasefire

  • రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న యుద్ధం
  • 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించిన అమెరికా
  • ఎటూ తేల్చని రష్యా.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న పుతిన్

కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా నానబెడుతుండటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణపై పుతిన్ విరుద్ధ ప్రతిస్పందనను ‘చాలా మోసపూరితమైనది’గా పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఆలోచనకు ప్రతిస్పందనగా పుతిన్ చెప్పిన ఊహాజనిత, మోసపూరిత మాటలను ఇప్పుడు మనం వింటున్నామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై పుతిన్ నిన్న మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు తాను అనుకూలమేనని, కాకపోతే అది ఎలా పనిచేస్తుందన్న దానిపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా రష్యా ఈ కాల్పుల విరమణకు అంగీకరించాలని అమెరికా పిలుపునివ్వగా, పుతిన్ మాత్రం బోల్డన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. తాము దేనినీ క్లిష్టతరం చేసే పరిస్థితులను విధించబోమని, కానీ రష్యా మాత్రం అదే పనిలో ఉందని జెలెన్‌స్కీ విమర్శించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించేందుకు పుతిన్ సిద్ధమవుతున్నారని, యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్టు ట్రంప్‌కు చెప్పేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పనిచేయని విధంగా పుతిన్ కొన్ని ముందస్తు షరతులు రూపొందిస్తున్నారని ఆరోపించారు. వీలైనంత వరకు దీనిని పొడిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పుతిన్ ఎప్పుడూ ఇలాగే చేస్తారని, ఏదీ వద్దని చెప్పరని, కానీ, ఆచరణలోకి వచ్చేసరికి ఆలస్యం చేసేలా చేస్తారని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News