Sapthagiri: హీరో కావడమనేది నేను చేసిన పొరపాటు కాదు: సప్తగిరి

- కమెడియన్ గా సప్తగిరికి మంచి పేరు
- హీరోగా తగ్గిన అవకాశాలు
- ఈ నెల 21న రానున్న 'పెళ్లికాని ప్రసాద్'
- హిట్ కొట్టడం ఖాయమంటున్న సప్తగిరి
తెలుగు తెరపై సందడి చేస్తున్న కమెడియన్స్ లో సప్తగిరి ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన సప్తగిరి, ఆ తరువాత కమెడియన్ గా తెరపైకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాగే కమెడియన్ నుంచి హీరోగా మారడానికి కూడా ఆయనకి ఎక్కువ సమయం పట్టలేదు. అలాంటి సప్తగిరి కొంత గ్యాప్ తరువాత హీరోగా చేసిన సినిమా 'పెళ్లికాని ప్రసాద్'. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో 'సప్తగిరి' బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. " కమెడియన్స్ చాలామంది కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో హీరోలుగా మారుతున్నారు .. ఆ తరువాత తిరిగి కామెడీ వైపు వస్తున్నారు. అలా చేయడంలో తప్పులేదనేది నా ఉద్దేశం. వేరియేషన్స్ చూపించే పాత్రలు పడినప్పుడు కొన్ని ప్రయోగాలు చేయకతప్పదు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే ఆడియన్స్ కి బోర్ అనిపించకుండా ఉంటుంది" అని అన్నాడు.
" హీరోగా మారిన తరువాత కమెడియన్ గా వచ్చే అవకాశాలను .. డబ్బును కోల్పోయాననే టాక్ బయట ఉంది. అందువల్లనే గ్యాప్ వచ్చిందని కూడా చెప్పుకుంటారు. కానీ ఆ మాటను నేను ఒప్పుకోను. ఎందుకంటే నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడానికి తగిన సమయం దొరికిందని అనుకుంటాను. అలా రీఛార్జ్ అయిన తరువాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పాడు.