Sridhar Babu: స్పీకర్‌పై వ్యాఖ్యలు... జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్

- సభ మీ సొంతం కాదని స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు
- ఈ సభ అందరిదీ... సమాన అవకాశాలు ఉంటాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- స్పీకర్‌ను దూషించేలా మాట్లాడారన్న మంత్రి శ్రీధర్ బాబు
'ఈ సభ మీ సొంతం కాదు' అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సభ అందరిదని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారని, ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు.
అయితే, సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారని స్పీకర్ ఆక్షేపించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మాట్లాడుతూ, శ్రీధర్ బాబు వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. జగదీశ్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పేమిటని ఆయన అన్నారు. శాసన సభ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి సంబంధించినది కాదని ఆయన అన్నారు.