KTR: బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

BRS Working President KTR Criticizes CM Revanth Reddy
  • ముఖ్య‌మంత్రిపై 'ఎక్స్' వేదికగా కేటీఆర్‌ ధ్వజం
  • సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ విమ‌ర్శ‌
  • అసమర్ధుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని మండిపాటు
  • పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావంటూ సీఎంపై ఫైర్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? అంటూ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్ధుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని మండిప‌డ్డారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడమని పేర్కొన్నారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా? అంటూ నిల‌దీశారు. పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశావంటూ సీఎంపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

"బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా? ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గ్యారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా?!. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలం. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం?. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడం.

లేనిది ఆదాయం కాదు. నీ మెదడులో విషయం. స్టేచర్ లేకున్నా, పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్లు నెత్తికెక్కాయి. పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థికరంగాన్ని చిందరవందర చేశావు. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు. ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా, అంగన్ వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా?

ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పరిపాలన రాక పెంట కుప్ప చేసి.. ఉద్యోగులు పనిచేస్తలేరని నిందలేస్తే సహించం" అని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.
KTR
BRS
Revanth Reddy
Telangana

More Telugu News