Chittoor: చిత్తూరులో కలకలం రేపిన కాల్పులు .. దోపిడీ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

- తుపాకులతో మాల్ యజమాని ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు
- గాలిలోకి కాల్పులు జరిపి యజమానిని బెదిరించే ప్రయత్నం
- మాల్ యజమాని అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
- దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చిత్తూరులోని గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు వారిని బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తుపాకులు, బుల్లెట్లతో పాటు పొగ బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చెందోలు పరిశీలించారు. మరో ఇద్దరు దుండగులు అక్కడే ఉన్నట్లు సమాచారంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు.
ప్రశాంతంగా ఉండే చిత్తూరులో కాల్పులు జరగడం స్థానికుల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.