Rajendra Prasad: నా సినిమా పోస్టర్ పై పేడ కొడితే నాకెలా ఉంటుంది?: రాజేంద్రప్రసాద్

- అప్పుడు చాలా బాధపడ్డానన్న రాజేంద్ర ప్రసాద్
- అన్నగారి మాట ఆలోచింపజేసిందని వెల్లడి
- వంశీతో గొడవపడేవాడినని వ్యాఖ్య
- రేలంగి నరసింరావుతో 35 సినిమాలు చేశానని వివరణ
రాజేంద్రప్రసాద్... ఒకానొక సమయంలో తెలుగు సినిమా హాస్యాన్ని పరుగులు పెట్టించిన కథానాయకుడు. రాజేంద్రప్రసాద్ కు ముందు తెలుగు సినిమాలలో హాస్యం ఉంది... ఆ తరువాత కూడా ఉంది. కాకపోతే కథలో అది ఒక భాగంగా మాత్రమే ఉండేది. అలా కాకుండా కథానాయకుడి చుట్టూ తిరిగే హాస్యంతో తనదైన మార్క్ చూపించడంలో రాజేంద్రప్రసాద్ సక్సెస్ అయ్యారు. ఆయన తరువాత ఆ స్థాయిలో ప్రభావితం చేసినవారు లేరనే చెప్పాలి.
అలాంటి రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు. "ఒక రోజు నేను ఎన్టీ రామారావుగారి దగ్గరికి వెళ్లాను. నేను డల్ గా ఉండటం చూసి ఆయన కారణం అడిగారు. నా సినిమా పోస్టర్ పై 'పేడ' కొట్టారు అని చెప్పాను. ఆ మాట వినగానే ఆయన పెద్దగా నవ్వారు. ఎవరో పనిగట్టుకుని వచ్చి నీ పోస్టర్ పై పేడ కొట్టారు అంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. దానికి నువ్వు సంతోషపడాలిగాని బాధపడకూడదు" అని అన్నారు.
"పెద్దాయన ఆ మాట చెప్పిన తరువాత నా ఆలోచనా విధానం మారిపోయింది. అప్పటి నుంచి ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం మొదలుపెట్టాను. సెట్లో రాజేంద్రప్రసాద్ తో కొంచెం కష్టమే అని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే నేను సెట్లో ఉంటే కాస్త అల్లరిగా... గొడవగానే ఉంటుంది. సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం వంశీ, నేను పోట్లాడుకునే వాళ్లం. నిజంగానే నేను కాస్త తేడా అయితే రేలంగి నరసింహారావు నాతో 35 సినిమాలు ఎందుకు తీస్తారు? క్రియేటివిటీ విషయంలో గొడవపడటంలో తప్పు లేదు" అని అన్నారు.