Sharmila: మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి: షర్మిల

- ఏపీలో ఆందోళనల బాటపడుతున్న అంగన్వాడీలు
- అంగన్వాడీల తరఫున గళం వినిపించిన షర్మిల
- అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవని స్పష్టీకరణ
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఆందోళనల బాటపడుతుండడం పట్ల ఆమె స్పందించారు.
మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు
- నెలకు గౌరవ వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
- గ్రాట్యూటీ చెల్లింపు హామీని అమలు చేయాలి.
- మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి.
- హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.
- పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
- విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలి.