Pranay: ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై స్పందించిన తండ్రి బాలస్వామి

Pranay father responds on judgement

  • ఈ తీర్పుతో కనువిప్పు కలగాలన్న ప్రణయ్ తండ్రి
  • ప్రణయ్ లేని లోటును ఎవరూ తీర్చలేరన్న బాలస్వామి
  • ఏదైనా సమస్య ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప హత్యలు సరికాదని వ్యాఖ్య

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు వెలువరించిన తీర్పుపై తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ హత్య కేసులో ఏ2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షను, మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు.

ఈ తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రణయ్ హత్యతో తాము చాలా కోల్పోయామని, ఇలాంటి హత్యలు జరగడం విచారకరమని అన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. తన కొడుకు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరిది కావాలని కోరుకుంటూ 'జస్టిస్ ఫర్ ప్రణయ్' పేరిట పోరాటం చేశామని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత కూడా పలు హత్యలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కులాన్ని పట్టుకొని వేలాడే వారికి, కుల దురహంకారంతో కూతుళ్లను చంపుకునే వారికి ఈ తీర్పు కనువిప్పు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రణయ్ హత్యతో తమకు కొడుకు లేకుండా, అమృతకు భర్త లేకుండా పోయాడని, మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు.

ఈ కేసులోని ఏడుగురు నేరస్తులకు జైలుశిక్ష పడిందని, వీరికి శిక్షపడినందుకు వారి కుటుంబాలు కూడా బాధపడుతూనే ఉంటాయని, కాబట్టి సుపారి తీసుకొని హత్యలు చేసే వారికి ఇది ఒక కనువిప్పు కావాలని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకొని, పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ హత్యలు సరికాదని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తమను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ తలొగ్గలేదని అన్నారు.

ఈ కేసు విచారణ ఆలస్యమవుతుందని చాలామంది అనుమానం వ్యక్తం చేశారని, కానీ పోలీసులు పకడ్బందీగా ఛార్జిషీట్ దాఖలు చేశారని కొనియాడారు. ఈ కేసులో న్యాయం జరగడానికి నాటి ఎస్పీ రంగనాథ్ కూడా సహకరించారని అన్నారు. ఈరోజు వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. మీకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందా? అని అందరూ అడుగుతున్నారని, కానీ కొడుకులేని లోటును ఎవరూ తీర్చలేరని కంటతడి పెట్టారు.

Pranay
Telangana
Crime News
  • Loading...

More Telugu News