Nara Lokesh: మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh inaugurates free electric buses in Mangalagiri

  • నారా లోకేశ్ చొరవతో మంగళగిరికి రెండు ఎలక్ట్రిక్ బస్సులు
  • సీఎస్ఆర్ నిధుల కింద బస్సులు అందించిన మేఘా ఇంజినీరింగ్
  • ఎయిమ్స్ కు ఒకటి, లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొకటి

మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ఉండవల్లి నివాసంలో జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వచ్చింది. 

సీఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (MEIL)ను మంత్రి లోకేశ్ అభ్యర్థించారు. లోకేశ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MEIL ఫౌండేషన్ రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. 

ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు... పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది. ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో సింగిల్ ఛార్జింగ్ తో 150 కి.మీ. వరకు నడుస్తుంది. 

ఈ బస్సులు డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి. 

ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K.V. ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ. కోటిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News