Rekha Chithram: మరో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్!

- మలయాళంలో హిట్ కొట్టిన 'రేఖా చిత్రం'
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- ఆల్రెడీ సోనీ లివ్ లో అందుబాటులో ఉన్న సినిమా
- ఈ నెల 14వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
మలయాళంలో ఆసిఫ్ అలీ - అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'రేఖాచిత్రం' అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాది ఆరంభంలో పడిన పెద్ద హిట్ గా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. జోఫిన్ చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమా, మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైంది. అలాంటి ఈ సినిమా ఆల్రెడీ 'సోనీ లివ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. తెలుగులోను అందుబాటులో ఉంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే అన్నట్టుగా, తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా మంచిపేరు తెచ్చుకున్న 'ఆహా'లోను అడుగుపెడుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ కూడా వచ్చేసింది. ఓటీటీ సినిమాల ద్వారా ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఈ సినిమాలో అతిథి పాత్రలో మమ్ముట్టి కనిపించడం కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.
కథ విషయానికి వస్తే... ఒక ఫారెస్టు ఏరియాకి వెళ్లిన రాజేంద్రన్ అనే శ్రీమంతుడు, 40 ఏళ్ల క్రితం తాను... తన స్నేహతులు కలిసి ఒక అమ్మాయిని అక్కడ పూడ్చిపెట్టామని సెల్ఫీ వీడియో వదిలి ఆత్మహత్య చేసుకుంటాడు. నిజంగానే అతను చెప్పిన చోటున ఒక యువతి శవం బయటపడుతుంది. ఆ యువతి ఎవరు? ఆమెను ఎవరు చంపారు? అప్పట్లో రాజేంద్రన్ కి సహకరించిన అతని స్నేహితులు ఎవరు? అనేది కథ.