SVSN Varma: ఎమ్మెల్సీ దక్కకపోవడంపై ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందన

- అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ
- ఎమ్మెల్సీ ఖాయమంటూ ప్రచారం
- టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో వర్మకు నిరాశ
- పిఠాపురం టీడీపీ కార్యకర్తలకు సర్దిచెప్పిన వర్మ
- చంద్రబాబు, నారా లోకేశ్ ఆదేశాలే శిరోధార్యమని స్పష్టీకరణ
పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ ఖాయమంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థుల జాబితాలో వర్మ పేరు లేదు. ఈ పరిణామంతో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, వర్మ పిఠాపురంలో కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. తనకు ఎమ్మెల్సీ దక్కకపోవడంపై కార్యకర్తలకు వివరించారు. టీడీపీతో తన ప్రస్థానం 23 ఏళ్లుగా కొనసాగుతోందని... టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబుతో అనేక అంశాలపై పనిచేశానని తెలిపారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఆదేశాలే తనకు, తన కుటుంబానికి, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు శిరోధార్యమని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వర్మ పేర్కొన్నారు.
రాజకీయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని... నియోజకవర్గస్థాయిలోనే పదవుల పంపకం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, అదే రాష్ట్రస్థాయిలో పదవులు పంపకం చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తనకు తెలుసని అన్నారు. ఆ పరిస్థితులను అర్థం చేసుకున్నానని తెలిపారు.