Pushpa-2: పుష్ప-2 లాభాలను వారికి ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టులో పిల్

- రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన పుష్ప-2
- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆ లాభాలను జానపద కళాకారులకు ఇవ్వాలంటూ పిల్
- పిల్ దాఖలు చేసిన న్యాయవాది నరసింహారావు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 ది రూల్ చిత్రం రికార్డు స్థాయిలో రూ.1740.95 కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా లాభాలను చిన్న బడ్జెట్ చిత్రాల రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పెన్షన్ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
పుష్ప-2 చిత్రం బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుతో బాగానే ఆదాయం రాబట్టిందని, ప్రభుత్వమే టికెట్ ధరలకు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. అయితే ఏ ప్రాతిపదికన టికెట్ ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో చెప్పలేదని... అందుకే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ లాభాలను కళాకారుల సంక్షేమం కోసం కేటాయించాలని కోరారు.
అయితే, ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ముగిశాయి కదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా... బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు వల్ల వచ్చిన లాభాల గురించే తాము పిల్ దాఖలు చేశామని పిటిషనర్ తెలిపారు.
వాదనలు విన్న అనంతరం... గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సమర్పించాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ పిల్ ను అడ్వొకేట్ నరసింహారావు దాఖలు చేశారు.