Shoaib Akhtar: పీసీబీ ప్రతినిధి ఎక్కడ?... పాక్ క్రికెట్ బోర్డుపై అక్తర్ ఆగ్రహం

- చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం
- ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కనిపించని పీసీబీ ప్రతినిధి
- తనకు చాలా బాధగా అనిపించిందన్న షోయబ్ అక్తర్
చాంపియన్స్ ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి ఆతిథ్య పాకిస్థాన్ నుంచి ప్రతినిధి హాజరు కాకపోవడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిందని, కానీ ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. "పీసీబీ నుంచి ఒక్కరూ లేరా? దీని గురించి ఆలోచించాలి. పీసీబీ సభ్యులు లేకుండా ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని చూడటం బాధగా అనిపించింది" అని అక్తర్ పేర్కొన్నాడు. పీసీబీ తన ప్రతినిధిని ఎందుకు పంపలేదని ప్రశ్నించాడు.
పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ పార్లమెంటు సమావేశాల కారణంగా ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరు కాలేనని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ దుబాయ్‌లోనే ఉన్నా కార్యక్రమానికి హాజరు కాలేదు. పాక్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీలు సహా క్రికెట్ అభిమానులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. భారత జట్టు విజేతగా నిలవడం వల్లే వారు తమ ప్రతినిధులను పంపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే, పోడియం మీదకు ఎవరెవరిని ఆహ్వానించాలనేది ఐసీసీ నిర్ణయిస్తుందని, పీసీబీ సీవోవో సమైర్ దుబాయ్‌లోనే ఉన్నప్పటికీ పోడియం మీదకు ఆయనకు ఆహ్వానం దక్కలేదని చెబుతున్నారు. ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రోజర్ ట్వోజ్ పాల్గొన్నారు. కాగా, 29 సంవత్సరాల తర్వాత పాక్ ఆతిథ్యమిచ్చిన చాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు ఒక్క విజయం కూడా సాధించకుండానే ట్రోఫీ నుంచి నిష్క్రమించింది.