Mark Carney: రాజకీయ అనుభవం లేని వ్యక్తికి కెనడా పగ్గాలు

- అధికార లిబరల్ పార్టీ చీఫ్‌గా ఎన్నికైన మార్క్ కార్నీ
- గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్‌గా పనిచేసిన మార్క్
- 1.5 లక్షల మంది పార్టీ సభ్యుల్లో 1.31 మంది ఓటు ఆయనకే
- త్వరలోనే కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 9 ఏళ్ల పాలనకు తెరపడింది. తాను ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు ఈ ఏడాది జనవరిలో ట్రూడో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీకి నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. దీంతో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ(59)ని పార్టీ తమ నూతన సారథిగా ఎన్నుకుంది. పార్టీ కొత్త చీఫ్‌గా ఎన్నికైన ఆయన త్వరలోనే ప్రధాని బాధ్యతలు చేపడతారు.
ఈ ఎన్నికలో మొత్తం 1.5 లక్షల మంది పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నీకు 1,31,674 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌కు 11,134 ఓట్లు, కరినా గౌల్డ్‌కు 4,785 ఓట్లు, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి. పార్టీ సారథిగా ఎన్నికైన కార్నీ కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. కాగా, ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, క్యాబినెట్‌లో పనిచేసిన అనుభవం లేని కార్నీ ప్రధాని కాబోతుండటం విశేషం.