Pranay Murder Case: అమృత-ప్రణయ్ కేసులో తుది తీర్పు నేడే!

pranay case investigation enters final stage

  • తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసు
  • పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత, ప్రణయ్
  • కిరాయి హంతక ముఠాతో ప్రణయ్‌ను హత్య చేయించిన అమృత తండ్రి మారుతిరావు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతిరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తీవ్ర సంచలనం రేపింది. నాడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతిరావు సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతిరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాప్తు చేసి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఛార్జిషీటు నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి, తీర్పును మార్చి 10కి రిజర్వు చేసింది.

సుమారు ఐదున్నర ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ మధ్యలోనే తీవ్ర మనస్తాపంతో ప్రధాన నిందితుడు మారుతిరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా సుభాష్ శర్మ, అజ్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, ఎంఎ కరీం, తిరునగరు శ్రవణ్ కుమార్, శివ, నిజాంలు నిందితులుగా ఉన్నారు.

వీరిలో సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్‌పై విడుదలయ్యారు. అస్గర్ ఆలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రలలోనూ కీలక నిందితుడిగా ఉన్నాడు. కాగా, ఈ కేసులో న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

  • Loading...

More Telugu News